ఓం


పంచ వృత్తులు
సద్గురు పరబ్రహ్మణే నమః

ఆ భగవంతుడి లక్షణాలు, ఆ దైవీ లక్షణాలే వున్నాయి. లక్షణరీత్యా నేను భగవంతుడు ఒక్కటే. నామరూపాలు భిన్నం అయితే అయివుండవచ్చుగాక. మిగిలినటువంటి సచ్చిదానంద లక్షణం అనే లక్షణం దృష్ట్యా చూస్తే, నేను భగవంతుడు ఒక్కటే.
నేను ఇది?
ఆత్మనేను. సాక్షి నేను. సాక్షిగా చూసినప్పుడు నువ్వు భగవంతుడు ఒక్కటే. వ్యష్టి వరకే చూసి సాక్షి అంటున్నప్పుడేమో కొద్దిగా తేడా వుంది. సర్వ సమష్టి మీద సమన్వయం చేసుకున్నప్పుడు, జీవించేటప్పుడు మరొకటి. అనంత విశ్వానికి సమన్వయం చేసుకుని జీవించేవాడు బ్రహ్మానుభవాన్ని పొందుతున్నాడు. కేవలం వ్యష్టి కుటుంబ బాధ్యతలు, వ్యష్టికి సంబంధించే మాట్లాడుకున్నప్పుడు ఆత్మానుభవం. ఆ సాక్షిత్వంలోనే రెండు భిన్న పార్శ్వాలు.

            (ఆత్మానుభవం తరువాతే కదండీ! అది... ఏవండీ! నేనేమంటున్నానంటే...)
ఎప్పుడూ కూడా పై స్థాయిని తెలుసుకుంటూ వుంటే, క్రింది స్థాయి సహజంగా జరుగుతుంది. ఎప్పుడూ బ్రహ్మానుభవాన్ని స్థిరంగా పట్టుకోవాలి. మధ్యలో ఆత్మానుభవం పూర్తి అవుతుంది. ఇప్పుడు లక్ష్యార్థము అందరికీ బ్రహ్మానుభవమే. ఎందుకని? బ్రహ్మము మాత్రమే సత్యము కాబట్టి, ఈశ జగములు జీవులు – ఎల్లప్పుడు తోచే భ్రాంతి. ఈ మూడూ వేరని తోచడమే భ్రాంతి. ఆ మూడుగా వున్నాయనే ప్రతీదీ నీకు అనుభవాన్ని ఇస్తున్నాయని పొందుతూవుంటావు ఎప్పుడూ కూడా. మెలకువలో వేరే అనుభవం, స్వప్నంలో వేరే అనుభవం, నిద్రలో వేరే అనుభవం. ఇలా మూడు మూడుగా లేవు? ఉన్నాయి. మరలా మూడు మూడుగా వున్నవన్నీ నీకు అనుభవాన్ని ఇస్తాయి. అనుభవం వస్తోంది నాకు, అనుభవం కలుగుతోంది అంటే అనుభవించేవాడు వున్నాడు, అనుభవం వుంది, అనుభవం ఇచ్చేది కూడా వున్నది. ఈ మూడు వున్నాయిగా. మరి సాక్షిలో మూడు లేవుగా. ఆత్మ స్థితిలో మూడు లేవుగా. అద్వైతంలో మూడు లేవుగా. ద్వైతమనే రెండు లేవుగా. కాబట్టి,

విచారణ ఎందుకు చేయాలి?
ఈ నిర్ణయాన్ని పొందడానికి చేయాలి. పదే పదే ఇదే నిర్ణయాన్ని నువ్వు మననం చేయడం ద్వారా, ఎప్పటికప్పుడు నీకు కనపడేవన్నీ త్రిపుటిలోనే కనపడుతాయి. తెలిసేవన్నీ త్రిపుటిలోనే తెలుస్తాయి. కానీ,

బుద్ధిని ఎటువైపు తిప్పాలట ఇప్పుడు?
ఈ ఆత్మభావం వైపు నిర్ణయాన్ని పొందే దిశగా బుద్ధిని విచారణ చేయడం అభ్యాసం చేయాలి. అక్కడ కనబడ్డది త్రిపుటే, కానీ నీకు కనపడుతున్నది మాత్రం ఆత్మ. అక్కడ వున్నది నామరూపాత్మకమే, కానీ లక్షణం అయిన సచ్చిదానందం అనే దృష్టితో చూస్తావు.

అప్పుడేమైంది?
కుండ, ముంత, చట్టి కనపడవు. మట్టే కదా! అన్నీ కూడా. (అంతటా మట్టే కదా!)
అంతటా వున్నది బ్రహ్మమే.

ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామత్ర మేవచ
తద్వత్‌ బ్రహ్మ జగత్సర్వం ఇతి వేదాంత డిండమః

సూటిగా చెప్పిందిగా. అంటే నల్లగా వున్నాడు, పొట్టిగా వున్నాడు, పొడుగుగా వున్నాడు, లావుగా వున్నాడు, సన్నగా వున్నాడు... నువ్వు ఎన్ని రకాలైనా చెప్పవయ్యా! 84 లక్షల జీవరాశులు చెప్పుకోవయ్యా... పంచభూతాలు చెప్పుకో! అంతకు మించి ఇంకేం చెప్తావు? ఈ సృష్టిలో ఏముంటాయయ్యా? ఇంతకు మించి ఇంకేముంది?
ఆ పంచభూతాలు, 84 లక్షల జీవరాశులు. ఇంతేకదా! అంతకు మించి నువ్వు ఎంతసేపు మాట్లాడుకున్నా అంతే, అందులోనే మాట్లాడుకోవల్సిందే. అవన్నీ కూడా వింత వింత రూపాలు, వింత వింత నామాలతో కనబడుతున్న ఒకే బ్రహ్మము.

కాబట్టి, ఏమైంది?
వానిలో అంతా వున్న లక్షణం ఒకటిగానే వుంది. కాబట్టి ఆ దృష్టిని అభ్యాసం చెయ్యి. ఆ దృష్టితో జీవించు.
జీవిత గమనంలో సుఖదుఃఖాలు జరుగుతూ వుంటాయి. వాటికి ఎవరూ కారణం కాదు. లేని కారణాన్ని, లేని కర్తృత్వాన్ని భుజాన వేసుకోవడం వల్ల జీవుడవు అయ్యావు. అంతే కదా! “నీవు కారణం అని బయట జగత్తు అంటోంది. అంటే... అన్నంత మాత్రాన అయిపోతావా?
నేను ప్రధానిని కావడానికి నీవే కారణం, నువ్వు ఓటు వెయ్యబట్టి నేను గెలిచి ప్రధానిని అయ్యాను అన్నాడండీ! ప్రతి ఓటరు నేను ఓటు వేశాను కాబట్టి, నువ్వు ప్రధానివయ్యావు కాబట్టి ... కారణ కర్తృత్వాలు వ్యక్తివి కాదు కదా! ఆ దేశంలో వున్నావు, ఓటు వేశావు. ఎవడినో ఒకడిని ప్రధాని అని అనాలి. అవుతాడు. అంతే కదా! వీడు ప్రధాని అవుతాడని వీడు ఓటు వేశాడా? లేదు.
కాబట్టి, అంతా ఈశ్వరమయంగా ఈ ప్రపంచం జరుగుతోంది. ఆ జరిగే కార్యక్రమంలో కొన్ని పాఠాలు సుఖం వల్ల వచ్చినవి, కొన్నిపాఠాలు దుఃఖం వల్ల వచ్చినవి. అవన్నీ పాఠాలు. అవన్నీ బుద్ధి యొక్క పరిణామ దశలు. బుద్ధి వికాసం కలగడానికి తోడ్పాటు. ప్రకృతి యొక్క సహకారం, ఈ పంచభూతాత్మకమైన సృష్టియొక్క సహకారం, అదే లేకపోతే నువ్వు గుర్తించలేవు కాబట్టి, ఆ దృష్టితో చూడవయ్యా! ఈ ప్రపంచాన్ని.

అందుట్లోదే ఈ ప్రకృతి.
సుఖదుఃఖాల రూపంలో చూసి ఎందుకు మునిగిపోతున్నావు?
బాగున్నాయి, బాగోలేదు దృష్టితోనే ఎందుకు చూడాలి?
ఓహో! “ఈశ్వర సంప్రాప్తమైనటు వంటి ప్రసాదం ఈ రూపాన వచ్చిందా?
అంతా ఈశ్వరుడే అయ్యి వుండి, ఈశ్వర ప్రసాదం కానిది ఈ సృష్టిలో ఏముంది? ఏం లేదు. నీ శరీరానికి హితం కాకపోతే, నీ ప్రాణానికి హితం కాకపోతే, ఏమి చెయ్యదు నిన్నది. అహితాన్ని స్వీకరించమని ఈ ప్రపంచంలో ఏ సిద్ధాంతము, ఏ శాస్త్రము బోధించదు. నీ శరీరానికి హితమే. కానీ ఏమైయుండాలి? హితం మితం. అయిపోయింది. అంతటితో ముగించేయాలి అంతే! కదలలేనంత తినకూడదు, హితమే కదా అని. అది పనికిరాదు. అహితాన్ని అసలు స్వీకరించకూడదు. ప్రాణం సమస్థితిలో నిలబడుతుంది. బుద్ధి, మనసు చెప్పిన విధంగా ఈ స్థాయికి వెళ్తాయి. నిరంతరాయంగా ఈ సాధనలు ఎప్పుడూ నిలబెట్టుకుని వుండాలి. అవి సహజమైపోతాయి. మళ్ళా పాఠం మొదలు పెట్టి అ, ఆ లు చదువుకునే పరిస్థితి వుండకూడదు.

ఆ స్థితిలో నిలబడి వుండి, ఇప్పుడేం చేయాలి?
చిత్తాన్ని వైరాగ్యంతో శుద్ధి చేయాలి. 

ఎందుకు? చిత్తంలో ఏమున్నాయి?
ఐదు వృత్తులున్నాయి. చిత్త వృత్తులు ఐదు రకాలు. పంచ వృత్తులు.

ఏమిటా పంచ వృత్తులు?
సంకల్పం, వికల్పం, విపర్యయము, స్మృతి, నిద్ర. ఈ ఐదు చిత్తవృత్తులు.

ఈ ఐదు (సంకల్పం, వికల్పం, విపర్యయము, స్మృతి, నిద్ర) చిత్తవృత్తులను నిరోధించడమే యోగం అంటే. ఆ ఐదు వృత్తులను నిరోధించాలి అంటే వైరాగ్యము’’ కావాలి. వైరాగ్యం లేకుండా యోగం అబ్బదు ఎవరికి.

కాబట్టి ఏం చేయాలి?
అనురాగం అంటే బాగుంది, బాగోలేదు- అనే ఆసక్తతను త్యజించాలి. అది వైరాగ్యం అంటే, ఆసక్తతను త్యజించడమే వైరాగ్యం. కర్మాసక్తతను త్యజించుట. కర్మ ఫలాన్ని కాదు.
ముందు ఆసక్తతను త్యజించేస్తే ఏమైంది?
కర్మ ఫలం మీద నీకు దృష్టిలేదు. కాబట్టి,

ఆసక్తతని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి?
మనసు చెప్పింది చేయమాకు.

ఎక్కడా?
భావంలో. అసలు బాహ్యందాకా మాట్లాడటంలేదు ముందు.

సాక్షి వున్నాడు, చిత్తవృత్తి ప్రేరేపణ చేసింది. గుణాన్ని ఆధారం చేసుకుని, సంస్కారాన్ని ఆధారం చేసుకుని.

సంస్కారం ఎట్లా ఏర్పడింది?
అభ్యాసం వల్ల ఏర్పడింది.

గుణం వల్ల పంచభూతాలు కలిగినాయి. పంచభూతాత్మకమైన శక్తులన్నీ గుణప్రభావం వలన పనిచేస్తాయి. కాబట్టి,

నీ బయట వున్నటువంటి పంచభూతాలలో వున్న గుణాలు, నీ లోపల వున్నటు వంటి అభ్యాసబలం ఈ రెండూ కలిసి చిత్తవృత్తిఅవుతోంది.

అవి ఏమిటి?
సంకల్ప రూపంలో కానీ, వికల్ప రూపంలో కానీ, విపర్యయం గానీ లేదంటే స్మృతి గానీ, నిద్రగానీ ... నిద్ర కూడా ఒక చిత్తవృత్తే. అది లేకపోతే ఏదో విలవిలలాడి పోతాం. ఆ వృత్తి నిరోధము లేదు? వుంది, ఒక వృత్తిని ఎలా నిరోధించాలి అనే జ్ఞానం లేదు.

ఎట్లా అవుతుంది యోగం?
సమత్వ యోగ ముచ్యతేఅంటే అర్థం ఏమిటి ఇప్పుడు?
చిత్తవృత్తి నిరోధం చేసినప్పుడు నీ అంతఃకరణం లయమైపోతుంది. మనసనేది లేదక్కడ. చిత్తవృత్తి నిరోధం చేసినవాడికి మనోలయంయిపోయింది.
మనసు ఎప్పుడైతే లయమైపోయిందో, వాడికి గుణాలు, సంస్కారాలు, అభ్యాసబలాలు వగైరాలు ఏమీ వాడి మీద పనిచేయవు. మనసును నువ్వు గుర్తించి, మనసును వున్నది అనుకున్నంత కాలం అది పనిచేస్తుంది. మనసే లేదంటే? వాడికి సుఖ దుఃఖాలు ఎక్కడుంటాయి?! (ఉండవు, అసలు గుర్తించేదే లేదు). కాబట్టి, మనోజయం ముఖ్యం. సాధనలలోకెల్ల మనోజయం ముఖ్యం.

మనోజయం అంటే ఏమిటి?
చిత్తవృత్తి నిరోధమే మనోజయం. వేరే ఏం లేదు. కాబట్టి,

ఆత్మవిచారణను ఎక్కడ వాడాలయ్యా?
వైరాగ్యాన్ని పూని, ఇక్కడ వాడాలి.

ఒకటి (వృత్తి) తోచింది.
ఆ తోచినదానిని ఏం చేయాలి?
ఓహ్‌! దీంట్లో వున్న గుణం ఏమిటి?
దీనిలో వున్న అభ్యాసం ఏమిటి?
దీంట్లో నా స్మృతి ఏమిటి?
జ్ఞాపకంఎలా నన్ను నెట్టుకుపోతుంది?
నా జ్ఞాపకంలో వున్నటువంటి గుణం ఏమిటి?
నా జ్ఞాపకంలో వున్న ఆసక్తత ఏమిటి?
ఓహో! ఈ ఆసక్తత నాలో వుండబట్టి, ఈ జ్ఞాపకం బలంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ జ్ఞాపకాన్ని రూపుమాపాలంటే, ఆసక్తతను పోగొట్టాలి.
ఆసక్తత ఎందువల్ల ఏర్పడింది?
అభ్యాసంలో సుఖం మీద ఆసక్తి కలిగింది. ఇదే చేస్తే సుఖం వస్తుందిఅని నాలో ఒక అభ్యాసబలం ఏర్పడింది.

ఆ సుఖం రాదు అని నిరూపణ చేస్తే ఏమైంది?
            ఇక దానితో పనిలేదు. కాబట్టి, దేనివలన అయితే నీకు సుఖం వస్తుందని అది భ్రాంతి చెందుతుందో, దాని వల్ల దుఃఖం వస్తుందని నిరూపించడానికి పూనుకోవాలి.
(అలా ప్రయత్నం చేయాలి) (అంతే కదా! మరి దాని అర్థం)

ప్రయత్నం చేస్తే ఏమైంది? అప్పుడు?
ఇహ దానిమీదకు (మనసు) వెళ్ళదు.

పిల్లికి పాలు త్రాగడం సహజమండి, అంతేనా? వేడి వేడి పాలు పెట్టావక్కడ. దానికి వేడి, చల్లదనం తెలియదు. పాలు తాగుతుంది. పాలు త్రాగితే ఏమైంది అప్పుడు? (నోరు కాలుతుంది) ఇక మళ్ళా ఎప్పుడైనా పాల గిన్నె చూడగానే పారిపోతుంది. ఎందుకని? దానికి (పిల్లికి) ఇప్పుడు స్మృతిలో ఏముంది? వేడి పాలు. అలాగే, దానికి ఏ మనసు వుందో నీకు అదే మనసు వుంది. కాబట్టి,

ఏ విషయసుఖం వుందని నీకు ఆసక్తత కలుగుతుందో, ఆ విషయసుఖంలో అది వైమనశ్యం పొందేటట్లుగా, వెనుకకు తిరిగేటట్లుగా, సుఖం లేదు ఇక్కడ దుఃఖం వుందని నిరూపణ పొందేటట్లుగా ప్రవర్తించు.

అలా training ఇస్తూ వుంటే ఇప్పుడేమైపోయిందది?
అందులోనుంచి వెనక్కొచ్చేస్తుంది (వైదొలగుతుంది). ఎప్పుడైతే పక్కకు తొలిగిందో, దానికి పనిలేదప్పుడు. విషయసుఖమే దానికి పని.

అందువల్ల,
పక్కకు రాగానే ఏం చెయ్యాలి ఇప్పుడది? శక్తి అంతా ఏమైపోవాలి? అప్పుడదే మంటుంది?
నాకు పనికావాలి. Show me some Job.

అది పని రాక్షసి. దానికి ఏ పని చెప్పకపోతే ఊరుకోదది.

అప్పుడేం చేయాలి?
నీవు ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మభావంలో స్థిరంగా వుండు.

అప్పుడే మంటుంది అది?
నాకు తెలియదు అంటుంది. నువ్వు చెప్పే విషయం నా స్మృతిలో లేదు, నా జ్ఞాపకాలలో లేదు. నా తెలివిలో లేదు.

లేకపోతే ఇప్పుడు ప్రమాదం ఏమి వచ్చింది?
అన్నీ నీకు తెలియాలని Rule లేదుగా. నేను చెప్పే వరకూ వుండు. నేను అనుమతి ఇస్తే పని చెయ్యి. అనుమతించక పోతే (calm గా) వుండు. లేదంటావ్‌,

పని చేస్తానంటావా? ఒకటే పని, ఏం పని?
దాన్ని తెలుసుకో. అతీతాన్ని తెలుసుకో. (నాకు తెలియదు).

అది వెంటనే ఏమంటుంది?
అది నాకు తెలియదు అంటుంది.

అయితే నేను చెప్పేవరకూ వుండు. కొంత పోరాటం జరుగుతుందన్నమాట. జరిగితే జరగని. ఇక అప్పుడు ఫలితాలు భిన్నంగా వస్తాయి. వస్తే రానీ.

ఈ పాఠం స్థిరం అవ్వాలి.
ఎప్పటికైనా సరే ధ్యేయాన్ని సాధించాలి అని ఎవరైతే ఈ మనసుని ఇట్లా లోంగదీసుకుంటాడో, ఈ చిత్తవృత్తులను నిరోధిస్తాడో, వాడిక ఏమై పోయాడు? వాడు కర్త కాడు, కర్మఫలం లేదు, స్పందించడు.
అని తెలివి లేదా?
తెలివి కలిగే వున్నాడు.
చైతన్యం లేదా?
చైతన్య స్వరూపుడే.
అర్థం చేసుకోలేడా?
అన్నీ అర్థం చేసుకోగలడు.
సామర్థ్యం లేదా?
అన్ని సామర్థ్యాలు వున్నాయి. కానీ,  ఏమీ చెయ్యడు.
జడమా?
కాదు.
చేతనమా?
చేతనమే. నువ్వు దేంతో లెక్కేస్తే దాంతోనే.
కానీ,
నేను సాక్షిని. (చేయవలసిన పని చేస్తాడు). ఎంతవరకూ?
ఈ ఐదు చిత్తవృత్తులు మరలా ఆసక్తత పొందనంతవరకు. Limit అదన్నమాట! అలా చేస్తాడు. Provided you should not cross this line. అని ముందు ఒక లైన్‌ పెట్టాలి. మెల్లగా ఆ లైన్‌ ని జరుపుతూ వచ్చేయాలి. వచ్చేస్తే ఏమైపోతుంది?
 దాని వ్యవహారం యొక్క చేసే, దేశం, కాలం, స్థితి తగ్గిపోతోంది. ఎందుకని ఈ లైన్‌ని జరిపేస్తూ వుంటాం మనం.
ఆఁ.. అప్పుడు ఈక్షణంలోనే వుండటం జరుగుతుంది.
ఒకొక్కప్పుడు గంటా, రెండు గంటలు, రోజు, సంవత్సరం వుండేది కాస్తా ఏమైపోతుంది?
మెల్లగా తగ్గిపోతుంది.
క్రమేపి మూసేస్తాం.
నీకు ఛాన్స్‌ లేదు. లేదన్నాక ఇంకేం చేస్తుంది?
క్షీణించి పోతే లొంగిపోతుంది. క్షీణించకపోతే లొంగదు. నిన్ను లొంగదీసు కుంటుంది. కాబట్టి,
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి అన్ని విషయాలలో వైరాగ్యాన్ని పూని, దైవీభావనతో కర్మను ఆచరించడం అనే స్థిర నిర్ణయానికి మనం రావాలి.

తాను దైవమై వుండగా, తనకు అంటుట ఏది?
నువ్వు దిగి వస్తే అంటింది. ఆసక్తతలోకి దిగి వచ్చినప్పుడు, చిత్తవృత్తిలో దిగి వస్తే అంటింది.
సాక్షిగా వున్నప్పుడు?
అంటదు.

సూర్యుడు సృష్టికి సాక్షి. సూర్యుడు లేకపోతే సృష్టిలేదు. ఇప్పుడు సృష్టిలో జరుగుతున్నవి ఏమన్నా ఆయనకు అంటినాయా?
(ఏమీ అంటలేదు అలాగే చూస్తున్నాడు.)
మనల్ని కూడా అలాగే వుండమంటున్నాడు కదా! అవును. కర్మ సాక్షి. ఎక్కడో వెతుక్కోనక్కర్లేదు భగవంతుడిని. ఇదిగో సాక్షి ఎదురుగుండా వున్నాడు.

ఆ సాక్షి ఎలా వున్నాడు?
స్వప్రకాశంగా వున్నాడు. స్వరూప జ్ఞానంలో వున్నాడు. స్వస్థితిలో వున్నాడు. తనదైన స్థితిలో తానున్నాడు. అలా వుండు నువ్వు కూడా.

కళ్ళెదురుగుండా దైవాన్ని పెట్టుకుని, ఎక్కడో దైవాన్ని నాలుగు చేతులు, పదహారు చేతులు, పద్దెనిమిది చేతులు ఊహించుట యేల? అవి లేవా?
అవీ వున్నాయి. ఒక్కో సంస్కారాన్ని, ఒక్కో బలహీనతని, ఒక్కో సామర్థ్యాన్ని, ఒక్కో సాధనకి అది అవసరం. కాబట్టి, భారత దేశంలో భగవంతుడు అనే ఒక సాధనను మనిషి తయారు చేసాడు. నీ సాధన వేగవంతం అవ్వాలి. నీకు బలం రావాలి.
నీకు దానిని అధిగమించగలిగే శక్తి రావాలి. ఆ యా సమయాలను బట్టి ఆ యా మంత్రారాధన, తంత్రారాధన, ఆ యా దేవతారాధన మహర్షులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కప్పుడు వీలు కాదు, ఎంత ప్రయత్నం చేసినా, నీ ఆత్మవిచారణని ఓడించేస్తుంది. అప్పుడు ఒక ప్రత్యేకమైన సాధన అవసరం అవుతుంది. Specialist దగ్గరకి వెళ్ళి చేయించుకోవాలి. రోజూ చేసే routine డాక్టర్‌ని చేయమంటే, నా వల్ల కాదు అంటాడు. అప్పుడేం చేయాలి. పంపించాలి. Specialist దగ్గరకు. వెళ్ళి వైద్యం చేయించుకుని మళ్ళా వస్తాడు. అట్లాగే,
గురువు గమనిస్తాడు. నీ నడకని. ఒక సమయం వచ్చినప్పుడు చెప్తాడు. అలా కాదయ్యా, ఇది ఇట్లా వంగటం లేదు, ఇదుగో ఫలనా ఆయన దగ్గరకు వెళ్ళి, ఆయన దగ్గర నువ్వు విద్య నేర్చుకుని, ఇలా ఆ విద్యంతా నువ్వు పొంది, అనుభవం పొంది, దానిని అధిగమించి రా! అదొకటి ప్రత్యేకమైన సాధన. చేస్తాడప్పుడు. చెయ్యాలి. లేకపోతే నువ్వు దానిని అధిగమించలేవు. నేను వెళ్ళనండి, నాకు మీరే గురువండీ అంటే? అర్రె!
నీకు కళ్ళద్దాలు వెయ్యాలండీ, కళ్ళద్దాలు పరీక్షించేవాడి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిందే. నా దగ్గరే వుంటానంటే? అది కుదరదు. నేనేదో జ్వరం వస్తే వైద్యం చేస్తాను, కడుపులో నొప్పి వస్తే వైద్యం చేస్తాను. తలనొప్పి వస్తే వైద్యం చేస్తాను  జనరల్‌ ఫిజీషియన్‌. ఆయన specialist. కళ్ళు వరకే చూస్తాడాయన. ఆయన వద్దకు వెళ్ళి ఇవన్నీ చెప్తే ఆయనేమన్నాడు? అవన్నీ నేను చూడనయ్యా, నువ్వు మామూలుగా వేరే రెగ్యులర్‌ డాక్టర్‌కు చూపెట్టుకో. కళ్ళ విషయం ఏమన్నా వుంటే చెప్పు మిగిలిన విషయం వుంటే వెరే దగ్గరకు వెళ్ళు. ఎందుకని? ఆయన పని అంతవరకే. ఏది ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలో అదే ఇస్తాడు, అంతవరకే. అట్లాగే,
ఈ విద్యలో కూడా నీ యొక్క నడక, నీ లక్ష్యం ఎప్పుడూ మారకూడదు. నేను ఎప్పుడు బ్రహ్మానుభవమే. సాక్షిగా వుంటా. ఇలా స్థిరంగా ఎవరైతే జీవనాన్ని సాగిస్తారో, ఆ అభ్యాసబలం వల్ల, ఆ వైరాగ్యబలం వల్ల, ఆ యోగ ప్రభావం చేత, ఈ జ్ఞానఫలం చేత నీకది సహజం అవుతుంది. ఆ సహజం అవ్వడానికి ఈ నాలుగు కారణాలు వున్నాయి.
 అభ్యాసబలం, వైరాగ్యబలం. అందుకని ఏమి చెప్తున్నాడు?

అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా 
పరం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్
ఏమయ్యా ఏం చేయ్యాలని అడుగుతావేంటీ? ఇంతసేపు చెబితే మళ్ళా ఏం చెయ్యాలని అడుగుతావేంటీ? అభ్యాసయోగ యుక్తేనా... చేతసా... నా అన్య గామినః పక్కకు పోకుండా, వేరే దానిని చింతించకుండా, సదా బ్రహ్మమును చింతించే అభ్యాసం దానికి ఏర్పాటు చెయ్యి. సదా బ్రహ్మముతో కలిసి వుండే... యోగం అంటే అది.
అభ్యాసం ఏంటీ?
బ్రహ్మమునే చింతించాలి.
యోగం ఏమిటి?
బ్రహ్మముతో కలిసి వుండాలి.
అనేటటువంటి పనిని దేనికి పెట్టాలి?
చేతసా నాన్య గామినః – అన్యంగా పోయే అంతఃకరణానికి ఈ పని పెట్టు.
ఎందుకయ్యా? ఏం తెలుసుకోవడానికి?
పరమం, గుహ్యం, యాతి పార్థాను చింతయన్‌.
పార్థ అంటే ఎవరు?
పార్థివ శరీరం ధరించిన ప్రతి ఒక్కడూ పార్థుడే. జీవుడు అని అర్థం.
కాబట్టి, ఎవరూ అర్జునునికి చెప్పలేదు.
యాతి పార్థ అనుచింతయన్‌
నాయనా! రెప్పపాటు ఎడం లేకుండా ఇలా చెయ్యి. ఏం చెయ్యిమని నన్ను ప్రతిసారి అడగమాక. నువ్వు బ్రహ్మానుభవం పొందే వరకూ...

అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా 
పరం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్
నీకు ఏదైనా అనుభవం కలిగింది. నిర్ణయం కలిగింది. దీనికంటే పరమేది? అని చింతించు. నీకు ఒక రహస్యం తెలిసింది. ఎవరికీ తెలియని రహస్యం నీకు బోధపడింది. దీనికంటే పరమమైన రహస్యం ఏదీ? అని చింతించు. (next step కి వెళ్ళాలి)
అని ఎప్పుడూ పైదాన్ని చూస్తూ వుండు. అక్కడితో ఆగిపోతే క్రిందకి పడిపోతావు. ఎందుకని?
10వ క్లాసు చదివనవాడు పదోక్లాసు వాడికి పాఠం బోధించలేడు. ఎందుకని? తొమ్మిదో క్లాసువాడికి సగం సగం చెప్తాడు. అదే 8వ క్లాసువాడికి, 7వ క్లాసువాడికి అయితే, బానే చెప్తాడు. ఎందుకని? ఒక క్లాసు కంటే క్రింద తక్కువది బాగా వచ్చుంటుంది, సహజమైంది. ఆ జ్ఞానం సహజం. అలాగే,

నువ్వు నీ వికాసం శరీరం వరకే పెట్టుకున్నావు. ఇక చేసేది ఏమీ లేదు. నీకు ప్రాణమే దైవం. శరీరం వరకే నా వికాసం వుందండీ అంటే, ప్రాణమే దైవం. ప్రాణానికి సంబంధించిన వికాసం వచ్చి ఆ సాధన నీవు సహజంగా చేయగలిగితే, స్థిరంగా వుండగలిగితే, అప్పుడు మనసులేదు. మనసుకు సంబంధించిన జపసాధన సహజంగా చేయగలిగితే బుద్ధి దైవం. బుద్ధి సహజంగా ధ్యాన చింతన ఆత్మ విచారణ యందు నిమగ్నమై వుంటే, అప్పుడు చిత్తము దైవము. చిత్తాన్ని వైరాగ్యపూరితం చేసినప్పుడు, అప్పుడు నీ అహంకారంలో వున్న ఆకారం తొలగిపోయి, అహం సాక్షి అయ్యింది. నేను సాక్షిని.
అందుకని ఏం చేయాలట?
శరీరం దీని పరిమితి ఎక్కడికి?
ఆహార, విహారం నీకు అంతకు మించి ఎక్కువ మాట్లాడే ఛాన్స్‌ లేదు. పులిహోర తింటావా? దద్దోజనం తింటావా? పప్పు అన్నం తింటావా? పెరుగన్నం తింటావా?
It is not the Question. (హితం, మితం.)

ప్రాణం - ఎగశ్వాస, దిగశ్వాస పడడం కాదు. పరుగులెత్తడము కాదు, అలా అని ఆపటము కాదు. సమస్థితిలో నియమం కలిగివుండాలి.

బుద్ధిమనసు నిరంతరాయంగా జపసాధన. అంతరంగంలో జరుగుతూ వుండాలి. పంచాక్షరి చెయ్యి, అష్టాక్షరి చెయ్యి, షోడశాక్షరి చెయ్యి ... నీ ఉపదేశ మంత్రం చెయ్యి,  ఏదైనా చెయ్యి. సహజంగా ప్రాణంతో సమంగా మనసు ఆంతరిక జపం చేస్తూ వుండాలి.
(శివమానస స్తోత్రం చదువుతున్నాను, చాలా చక్కగా మొన్న మాటలు కూడా, అటునుంచి వస్తున్నా కూడా అది అలా నిలబడి round తిరుగుతూనే వుందట్లా...)

దానికి పరీక్ష ఎప్పుడంటే, “నిద్రపోయేటప్పుడు జపం జరుగుతుందో లేదో చూడాలి. అది మానసిక జపానికి పరీక్ష. ఇలా ప్రతి దాంట్లోనూ పరీక్ష వుంటుంది. ప్రతి సాధనకు ఒక పరీక్ష వుంటుంది.

మితాహారం, హితాహారం తినే వారికి పరీక్ష ఏమిటి?
వీరికి ఆహారం భ్రాంతి వుండదు.
అంటే ఎలా వుంటాడు?
(ఏదో ఆకలి వేస్తే అంతవరకు తినడం)
ఆకలి వేయకపోతే తినడని కూడా అర్థం అన్నమాట. ఆకలి వేయకపోతే తినడిక.
ఇప్పుడెలా తింటున్నాం?
టైం ప్రకారం తినేస్తున్నాం. అలా పనికి రాదు. ఆకలి వేస్తేనే తింటాడు అంతే. ఆకలి వేయకపోతే లేదు. అలా వుంటాడు. అది హితాహారం, మితాహారం అంటే అర్థం. అది పరీక్ష దానికి. అవసరమైతే ఒక రోజులో ఆరుసార్లైనా తినగలుగుతాడు. అవసరం లేకపోతే ఆరు నెలలు కూడా తినడు. దానికైనా సిద్ధమే, దీనికైనా సిద్ధమే.
(ఒకేసారి రాదు కదా?)

ఇప్పుడేం చెప్పాడు?
ఏదైనా సరే, ఒక్క సారిగా రాదు, అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్య గామినా
అలా ప్రతిస్థాయిలో పరీక్షలు వుంటాయి. ఆ టెనాసిటీ, ఆ end end తెలిసిపోతే, ఇంకా నీకు తెలుసుకోవడానికి ఏముంది? ఆ end end తెలియనప్పుడు...
జననం ఎలా వుందో నీకు తెలియదు, మరణం ఎలా వుందో నీకు తెలియదు, కాబట్టి జీవితంలో ఊగిసలాడుతున్నావు. ఆ రెండూ తెలిస్తే, ఇక ఊగిసలాట లేదు.
అట్లాగే శరీరానికి ఆ end end. ఏ సుఖానికైనా ఆ end end, ఏ దుఃఖానికైనా ఆ end end. ఇంకేముంది? ఎంత కొట్టుకున్నా ఆ రెండిటి మధ్యే కొట్టుకోవాలి అంతే. ఇక వేరే ఛాన్స్‌ లేదు. ఇలా ఎప్పుడైతే అన్నీ తెలిసిన వాడుంటాడో, వాడికేమైంది? సమకూరింది.
‘‘యోగం సమత్వముచ్యతే, యోగః చిత్త వృత్తి నిరోధకః ఇలా యోగ శబ్దంతో ముడిపడినవి అన్నమాట. యోగంఅంటే అర్థం ఏమిటంటే? కలియుట. నీ లక్ష్యార్థ స్థితితో కలిసి వుండుట. సదా బ్రహ్మమునే చింతించుట అభ్యాసం, బ్రహ్మమునందే లయించి యుండుట. నీ అంతఃకరణమును బ్రహ్మమునందే లయింపచేసి వుండుట  బ్రహ్మనిష్ఠ. అది యోగం. తద్వారా జ్ఞానం. తద్వారా అనుభవం. ఆ బ్రహ్మానుభవం కలుగుతుంది. అనంత విశ్వము నేనే అయి వున్నాను. ప్రత్యేకంగా లేను. భిన్నంగా లేను. సామాన్యముగా వున్నాను, ఉన్నది నేనే. ముందు అక్కడిదాకా రావాలి. ఆ తరువాత ఉన్నది కూడా లేదనేది అప్పుడు అచల సిద్ధాంతము. ఇలా క్రమమైనటువంటి అభ్యాసం ద్వారా, శరీర ప్రాణ మనో బుద్ధులనే, శరీరము-ప్రాణము-మనస్సు-బుద్ధి-చిత్తము అనే అయిదు పరిమితులను అధిగమించి, చిచ్ఛక్తి – చైతన్యమే నేను అనే స్థాయిలోకి మారాలి. ప్రజ్ఞయే నేను, చైతన్యమే నేను, ఆత్మయే నేను. ఆ స్థితులను బట్టి పేర్లు పెట్టారు. బ్రహ్మమే నేను. అర్థమైందా? నాహం కర్త, నాహం భోక్త’. నేను కర్తనూ కాను, నేను భోక్తనూ కాను. అలా స్థిరంగా సహజంగా వుండాలి.

ఆ స్థిరత్వం, సహజత్వం ఎట్లా కలుగుతాయి?
ఇందాకే చెప్పా. ముందు తెలుసుకోవాలి, తరువాత నిర్ణయం, తరువాత నిశ్చయంగా వుండటం, తరువాత స్థిరంగా వుండటం తరువాత సహజం అవ్వటం. ఇది క్రమం. అధిగమించిన స్థితిలో సహజంగా వుంటావు. మొదటి నాలుగు దశలలో పరిణామం చెందుతావు.
జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి. కాబట్టి అధిగమిచినటువంటి అతీత స్థితిలో సహజంగా వుంటావు. కాబట్టి ఎప్పుడూ అతీతాన్ని లక్ష్యంగా పెట్టుకుని మానవులు జీవించాలి. అది ఏదైనా సరే, దీన్ని అధిగమించి వుండాలి నువ్వు ఎప్పుడూ. అధిష్ఠానంగా వుండాలి. అంతేగాని దానికి లోబడి విలవిలలాడి పోకూడదు. అది మనిషికి స్వధర్మం కాదు. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అంటే అర్థం ఇది. నేను సాక్షిని అనే స్వధర్మ స్థితిలో, ఎవడైతే వున్నాడో, నిధనం శ్రేయః, మార్పు లేనటు వంటిది. * తన మూలమును తాను ఎరిగిన వాడే, తన గురించి తాను ఎరిగిన వాడే, ఆ స్థితియందు సహజంగా స్థిరంగా వుంటాడు. పరధర్మో అంటే దానికంటే భిన్నము, భయావహః  ప్రకృతీ భావం, భయం అంటే అక్కడ అర్థం ఈ భయాలు కావు. ప్రకృతీ భావాన్ని పొందుట. జీవభావంలో పడతాడు. జనన మరణ భయాన్ని పొందుతాడు. అని అర్థం. కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకోవాలి.
అట్లా ఏ శాస్త్రాన్నైనా ఈ దృష్టి కోణంలో, అధ్యయనం చేయడం, ఆ అధ్యయనం చేసిన దానిని నిశ్చయంగా చూసి తెలుసుకోవడం, నిశ్చయంగా తెలిసిన దానిని, నీ జీవితానికి అన్వయం చేసికొని నిర్ణయంగా ఆచరించడం, స్థిరమై యుండటం, అప్పుడు ఆ జీవితంలో సహజత్వం కలుగుతుంది, ఇలా నిలబడాలి. అర్థమైందా? జై బాబా. 



ఓం తత్‌ సత్‌
 https://sadhakudu.blogspot.in